Thursday, January 19, 2012

రిజర్వేషన్లలో... కాపు కోణం

రాష్ర్టంలో ప్రస్తుతం కొనసాగుతోన్న వెనుకబడిన రిజర్వేషన్ల శాతాన్ని 25 నుంచి 50 శాతానికి పెంచాలని ఎంతో కాలంగా బీసీ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా కాపుల్ని బూచీగా చూపించి బీసీ కమిషన్‌ ఈ నెల 28న నిర్వహించనున్న బహిరంగ విచారణను వాయిదా వేసేందుకు రంగం సిద్దమవుతోందనే ప్రచారం ఊపందుకొంది. వాస్తవంగా ఇదే జరిగితే బీసీలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా బహిరంగ విచారణకు తాను కట్టుబడి ఉన్నానని బీసీ కమిషన్‌ చైర్మన్‌ దాల్వా సుబ్రహ్మణ్యం ఇస్తున్న హామీ ఎంత వరకు నిలుస్తుంది? కొన్ని రాజకీయ శక్తులు బీసీలను దొంగదెబ్బ తీసేందుకు తెరవెనుక భాగోతం నడిపి గందరగోళం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా? బీసీ కమీషన్‌ వెనుకబడిన తరగతుల వారికి అనుకూలంగా 25 నుండి 50 శాతానికి రిజర్వేషన్లు పెంచేందుకు చేపట్టే చర్యలకు అడుగడుగున్నా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో నోటిఫికేషన్‌ ఎందుకు జారీచేయాల్సి వచ్చిందనే విషయమై బీసీ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేయడం ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది.

దీనికి సంబందించిన ఫైల్‌ను సీఎంకుపంపడంతో రాజకీయనాయకులు ఒత్తిడిలు కొంత మేరకు ఫలించాయనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్‌ ఈ నెల 28 జరపాల్సిన బహిరంగ విచరణ జరుగుతుందా? వాయిదా పడుతుందా? అనే మీమాంస అధికారుల్లో సైతం నెలకొందంటే రాజకీయ ఒత్తిళ్లు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతోంది. వాస్తవానికి బీసీ కమీషన్‌ ప్రకటనలో ‘విజ్ఞాపనలు, సూచనలు, అభ్యంత రాలు’ తెలియజేసుకోవచ్చని స్పష్టంగా ప్రకటించి నప్పటికీ సామాజిక న్యాయం జరగాలంటే కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు రిజర్వేషన్లు అవసరమంటూ కొత్తవాదన తీసుకురావడం దుర దృష్టకరమని బీసీలు ఆరోపిస్తున్నారు.

అయితే తమని బీసీ జాబితాలో చేర్చుతామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని కాపులు ఆధారాలు చూపుతున్నారు. అయితే రాష్ర్టంలో వెనుకబడిన కులాలన ధ్రువీకరించమని పుట్టు స్వామి కమీషన్‌ వేస్తే, ఆ కమీషన్‌ పూర్తిస్థాయిలో తేల్చకపోవడంతో సమస్య పునరావృతమవుతోందని కాపులు ఆరో పిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్ని బీసీలుగా గుర్తించాలని చేపట్టిన నిరాహార దీక్ష ఫలితంగా నాటి ప్రభుత్వం దిగివచ్చి పై నాలుగు కులాలతోపాటు మరో పది కులాలను అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి హయాంలో బీసీ జాబితాలో చేర్చారని గుర్తు చేస్తున్నారు.

ఆతర్వాత వచ్చిన ఎన్‌టిఆర్‌ ప్రభుత్వం ఆ జీఓను కొట్టివేయడంతో అప్పటి నుండి కాపులు బీసీ జాబితాలో చోటు సంపాదించుకునేందుకు పోరాడుతూనే ఉన్నారని వివరిస్తున్నారు. ఇప్పటికీ రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న అనేక బీసీ కులాలతో తమకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని రుజువులతో సహా చూపుతున్నారు. కనుక తమని బీసీ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీని వెనుక కాపు రాజకీయ నాయకులు ప్రోద్భలం కూడా ఉందని తెలుస్తోంది. కాగా ఒక కులాన్ని బీసీగా గుర్తించడానికి సామాజికంగా, విద్యా పరంగా వాళ్లు వెనకబడి ఉండాలని ఆర్టికల్‌ 15/4 ప్రకారం రాజ్యంగం నిర్ణయించిన మాటను బీసీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

ఇప్పటికే పెద్దఎత్తున ఇతర కులాలను బీసీ జాబితాలో చేర్చడంతో ఓసీలకు అప్రకటిత రిజర్వేషన్‌ కోటా పెరిగిపో తోందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే బీసీ రిజ ర్వేషన్ల కోటా పెరిగే అవకాశాలు మెరగ య్యాయని ఆశగా ఎదురుచూస్తున్నవారికి పిడుగు లాంటి వార్త వినిపించిందని ఆందోళన చెందుతు న్నారు. కొందరు రాజకీయ నాయకుల జోక్యంతో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిహ రంగ విచారణ వాయిదాపడే అవకాశాలు ఉన్నా యనే వార్త వారిని మరింత కుంగదీసిందని చెపుతు న్నా రు. అయితే బహిరంగ విచారణ జరిగి తీరు తుందని బీసీ కమీషన్‌ చైర్మన్‌ స్పష్టం చేసినప్పటికీ ఆయన నోటిఫికేషన్‌ ఎందుకు జారీచేయాల్సి వచ్చిందనే విషయమై ప్రభుత్వానికి నివేదిక అంద జేయడం ఆరోపణలకు మరింత బలం చేకూరు తోంది. గందరగోళపరిచే ఈ పరిస్థితిపై వివరణ ఇస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని బీసీ నాయకులు కోరుతున్నారు.

No comments: