Thursday, January 19, 2012

కాపా? బీసీనా?

:పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీసీనా? కాపు నాయకుడా? ఆయన ఎవరికోసం పనిచేస్తున్నారు? కాపు లతో బీసీలకు వైరం ఉన్న నేపథ్యంలో సీఎం సీటు కోసం సత్తిబాబు బీసీకార్డును కాపులకార్డుతో కలిపివేసే వ్యూహం లో ఉన్నారా? సాంకేతికంగా బీసీ అయిన బొత్స కాపుల సర్వేకు ఒత్తిడి చేయడమేమిటి? పట్టుపట్టి 22 లక్షలు విడు దల చేయించడమేమిటి? బీసీల సర్వేకు నిధులకోసం ఎందు కు ఒత్తిడి చేయకుండా మౌనం వహిస్తున్నారు? కాపులకోసం ఎందుకు కలవరిస్తున్నారు?.. ఇప్పుడు కాంగ్రెస్‌లోని బీసీల ను గందరగోళపరుస్తున్న ప్రశ్నలివి. పీసీసీ అధ్యక్షుడు బొత్స బీసీనా? కాపా? ఓసీనా? అన్న ప్రశ్నలు కాంగ్రెస్‌లోని బీసీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సాంకేతికంగా తూర్పు కాపు వర్గానికి చెందిన సత్తిబాబు, మంత్రివర్గంలో బీసీ కోటాతోనే చేరారు. ఉత్తరాంధ్రలో బలమైన కొప్పుల వెలమ, గవర, కళింగ, మత్స్యకారులతో పాటు తూర్పు కాపు కూడా బలమైన సామాజికవర్గమే.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ మూడు కులాలు బలమైనవి. వాటిలో మూడు జిల్లాల్లోనూ కొప్పుల వెలమ- తూర్పు కాపుల సంఖ్యాబలం ఎక్కువ. బీసీల్లో ఈ రెండే బలమైన వర్గాలు. అలాంటి తూర్పు కాపు వర్గానికి చెందిన సత్తిబాబు పీసీసీ అధ్యక్షుడు అయ్యేందుకు చాలాకాలం బీసీకార్డును ఉపయోగించిన విషయాన్ని పార్టీలోని బీసీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవిని సాధించేందుకు ఉత్తరాంధ్రలోని బీసీ కులాలతో పాటు, తెలంగాణలోని మున్నూరు కాపు కులాలకు చెందిన నాయకులను సమన్వయం చేసుకుని ఆ పదవి సాధించారని చెబుతున్నారు. తీరా పీసీసీ అధ్యక్ష పదవి సాధించాక సత్తిబాబు వ్యవహారశైలి పూర్తిగా మారిందని బీసీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఓడ దాటేవరకు ఓడమల్లన్న ఓడదాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు, బీసీలమీద నిర్లక్ష్యభావంతో వ్యవహరిస్తున్నారని బీసీ నేతలు ధ్వజమెత్తారు.

పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి మీద కన్నేసిన సత్తిబాబు అందుకోసం ఇక బీసీల మద్దతు అవసరం లేదన్న భావనతో కాపులకు దగ్గరవుతున్నారని విశ్లేషిస్తున్నారు. బొత్స చేస్తున్న హడావిడి తీరు చూస్తే అసలు ఓసీ కాపుగానే కనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. తన ముఖ్యమంత్రి పదవి కలల సాకారం కోసం కాపు-బీసీలను కలపాలన్న తపనతో పనిచేస్తున్నారని, కానీ అది జరిగే పనికాదంటున్నారు. ఇటీవల కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు మీడియతో మాట్లాడుతూ, బొత్సను సీఎం కిరణ్‌ అణచివేస్తున్నారని ఆరోపించడాన్ని బీసీ నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అసలు బీసీలతో ఎలాంటి సంబంధం లేని కాపునాడు.. బీసీ అయిన బొత్సకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందడమే వింతగా ఉందని, దీనివెనుక బొత్స తాపత్రయం, వ్యూహమేమిటో స్పష్టమవుతోందని బీసీ నేతలు విశ్లేషిస్తున్నారు.

అసలు కాపులే రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితిని గమనించి మౌనంగా ఉంటుంటే, కాపు నేతగా చెలామణి అయేందుకు ప్రయత్నిస్తున్న బొత్స మాత్రం తానే అసలైన కాపుగా హడావిడి చేస్తున్నారని బీసీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో అసలు కాపులు కూడా బొత్స హడావిడిపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాపులకు- తమకు ఏ విషయంలోనూ సరిపడదని, ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు తమపై అనునిత్యం భౌతిక దాడులు చేస్తుంటే తాము కాపులతో కలసి ఎలా పనిచేస్తామని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం సీఎం సీటు కోసమే బొత్స తాను బీసీ అయి ఉండీ కాపుల వెంట తిరుగుతూ కాపు ప్రతినిధితోపాటు.. కాపు-బీసీల ఉమ్మడి నేతగా ప్రచారం చేసుకునే వ్యూహంతో ఉన్నారని చెబుతున్నారు. బీసీల సంక్షేమాన్ని బొత్స విస్మరిస్తున్నారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.

బీసీల సర్వే కోసం 50 కోట్లు కావలసి ఉంది. ఆ మేరకు బీసీ కమిషనర్‌ నాటి సీఎం వైఎస్‌కు నివేదిక ఇచ్చింది. దాన్ని ఇంతవరకూ పరిశీలనలోకి తీసుకోలేదు. ఇప్పటివరకూ నయాపైసా విడుదల చేయలేదు. అయితే, కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌ నేపథ్యంలో.. కాపుల సర్వే కోసం 30 లక్షలు అవసరమని బీసీ కమిషన్‌ చెప్పింది. ఆ మేరకు 22 లక్షల 50 వేల రూపాయలు రెండు విడతలుగా విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. నిజానికి, 2011-2012 బడ్టెట్‌లో 6లక్షల 20 వేలు మాత్రమే కేటాయింపు చూపింది. అయితే నిధుల విడుదలలో మాత్రం అంచనాలకు మించి విడుదల చేసినట్లు స్పష్టమయింది. దానికోసం బొత్స చాలా పోరాడారు.

నాటి సీఎం రోశయ్యకు లేఖ రాయడంతో పాటు, స్వయంగా కలసి ఒత్తిడి చేశారు. కాపుల సర్వేకు నిధుల విడుదల కోసం తాను సీఎంను కలసి ఒత్తిడి చేసిన విషయాన్ని స్వయంగా మీడియాకూ వెల్లడించారు. బొత్స ఒత్తిడి ఫలితంగా కాపుల సర్వే కోసం ప్రభుత్వం 22 లక్షల 50 వేల రూపాయలు విడుదల చేసింది. దీన్ని బట్టి బొత్స తన బీసీ కార్డును పీసీసీ అధ్యక్ష పదవి వచ్చేంతవరకూ వాడుకున్నారని, ఇప్పుడు సీఎం పదవి కోసం కాపు కార్డును వాడుకుంటున్నారని బీసీ నేతలు విరుచుకుపడుతున్నారు. స్వతహాగా బీసీ అయి ఉండీ, బీసీల కోసం కాకుండా కాపుల కోసం పనిచేయడం బీసీలకు ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తుతున్నారు. తాజాగా జరిగిన విస్తరణలో కూడా బీసీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని ఒత్తిడి చేయకుండా చిరంజీవి సిఫారసు మేరకు కాపులకు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేస్తూ.. దీన్ని బట్టి బొత్సకు బీసీలపై ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతోందని విమర్శిస్తున్నారు

No comments: