Thursday, January 19, 2012

చట్రంలో చిరు?

కాంగ్రెస్‌లో ఎదిగే క్రమంలో ఉన్న చిరంజీవి కొందరి చట్రంలో చిక్కుకుంటున్నారా? పీఆర్పీ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన జూనియర్‌ మేధావులు ఆయన ఎదు గుదలను తమ స్వార్ధం కోసం ఒక వ్యూహం ప్రకారం అడ్డుకుంటున్నారా? చిరుపై కులంముద్ర వేయడం ద్వారా ఆయనను ఒక కులానికే పరిమితం చేసి కొందరివాడిగా మార్చేందుకు సిద్ధమవుతున్నారా? కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాలను శాసించే అవకాశం వచ్చిన ఆయ నకు చుట్టూ ఉన్న కోటరీ అవరోధంగా పరిణమించిందా? రాజకీయ అనుభవజ్ఞులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు, జర్న లిస్టులు దరికి చేరితే తమ మనుగడకు ప్రమాదమన్న దూరదృష్టితో వారిని జూనియర్‌ మేధావులు అడ్డుకుంటు న్నారా?.. గత కొద్దిరోజుల నుంచి తమ పార్టీలో జరుగు తున్న అంతర్మథనమిది
కాంగ్రెస్‌ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న చిరంజీవిని ఎదగనీయకుండా ఆయన చుట్టూ ఒక కోటరీ ఏర్పడిం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి చిరంజీవికి రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయాలతో పాటు, ఇతర పార్టీ పరిణామాలేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ చేరిన కొందరు నేతలు ఆయన చుట్టూ అడ్డుగోడలా నిలుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీఆర్పీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఈ జూనియర్‌ శక్తులు తాము ఒక్కరే చిరంజీవి దృష్టిలో మేధావులుగా ముద్ర వేయించుకోవాలన్న దూరదృష్టితో ఇతరులను రానీయకుండా సైంధవ పాత్ర పోషిస్తున్నారంటున్నారు. పైగా తమకు అనుకూలంగా ఉండే వారిని చుట్టూ నియమించే వ్యూహంతో ఉన్నారు.

ఇటీవల తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఇతర జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం తమ మనోభావాలు తెలిపేందుకు ప్రయత్నించగా, సదరు జూనియర్‌ మేధావులే చిరంజీవికి అడ్డుగోడగా నిలిచారన్న ఆరోపణలున్నాయి. చిరంజీవి వద్ద కొత్త వారు చేరితే తమ పట్టు ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతోనే ఈ జూనియర్‌ మేధావులు అటు సీనియర్‌ నాయకులను, ఇటు జర్నలిస్టులను చిరు వద్దకు చేరకుండా సైంధవపాత్ర పోషిస్తున్నారంటున్నారు. గతంలో ఎలాంటి రాజకీయానుభవం గానీ, రాష్ట్ర స్థాయి రాజకీయాలను విశ్లేషించే అనుభవం గానీ లేని ఈ జూనియర్‌ మేధాలవుల వల్ల చిరంజీవి ఒక చట్రంలో ఇరుక్కుపోతున్నారన్న ఆవేదన పీఆర్పీ నేతల్లో వ్యక్తమవుతోంది. వీరిని వదిలించుకుని, అందరితో మమేకం కాకపోతే కాంగ్రెస్‌లో మనుగడ కష్టమంటున్నారు.

ఇక ధృతరాష్ట్ర కౌగిలి వంటి కాంగ్రెస్‌ నీడలో చిరంజీవి ఉన్నంతకాలం ప్రతిదీ సునిశితంగా పరిశీలించాలంటున్నారు. చిరంజీవి కాంగ్రెస్‌లో చేరినందున కాపులు కాంగ్రెస్‌కు పెద్ద ఓటు బ్యాంకుగా మారారు. ఇది కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కమ్మ, రెడ్డి, దళిత వర్గాల నాయకులకూ కలసిరానుంది. ప్రతి నియోజకవర్గంలోనూ కాపుల ఓట్లు కనీసం 20-25 వేల వరకూ ఉన్నాయి. తమ సామాజికవర్గ ఓట్లతో పాటు కాపు ఓట్లు కూడా అనుకూలిస్తేనే తాము గెలుస్తామన్న ముందుచూపుతో చాలామంది కాపేతర నాయకులు, మంత్రులు సైతం చిరంజీవి సాన్నిహిత్యం కోసం తపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో తూర్పు కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చిరు తమ వైపు ఉంటే బయటపడతామన్న భావనతో ఉన్నారు. అయితే, ఈ వాస్తవాన్ని గ్రహించకుండా, చిరంజీవిని కేవలం ఒక కాపులకే పరిమితం చేసి, ఆయనను కొందరివాడిగా చేసే ప్రయత్నాలు సొంత కోటరీ లోనే జరుగుతోందంటున్నారు.

చిరంజీవి కంటే దశాబ్దాల ముందే రాజకీయాల్లో ఉంటూ కాపు నాయకులుగా ముద్ర పడిన వంగవీటి మోహనరంగా, ముద్రగడ పద్మనాభం వంటి పెద్ద నేతలకు ప్రజాకర్షణ, ఇమేజ్‌ ఉన్నప్పటికీ కేవలం కాపు నేతలన్న కుల ముద్ర ఉండటం వల్లే రాణించలేకపోయారని విశ్లేషిస్తున్నారు. వంగవీటి జీవించినంతకాలం పోరాడగా, ముద్రగడను ఇప్పటికీ ఏ రాజకీయపార్టీ ఆదరించేందుకు సాహసించలేకపోతోందని గుర్తు చేస్తున్నారు. నిజానికి, చిరంజీవి పీఆర్పీ స్థాపించిన తర్వాత కాపులకు గుర్తింపు కంటే రాజకీయంగా నష్టమే ఎక్కువ జరిగిందన్న ఆవేదన ఇప్పటికీ వినిపిస్తోంది. కాంగ్రెస్‌-టీడీపీలో ఒక వెలుగు వెలిగి.. వైఎస్‌, బాబు ఎంత నచ్చచెప్పినా వినకుండా కేవలం కులాభిమానంతో ఆయా పార్టీలకు రాజీనామా చేసి మరీ బయటకువచ్చిన వారి రాజకీయ జీవితాలు ప్రస్తుతం డోలాయమానంలో పడ్డాయని విశ్లేషిస్తున్నారు.

కొత్తపల్లి సుబ్బారాయుడు, మళ్లీ టీడీపీలో చేరిన కళావెంకట్రావు, కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన బూరగడ్డ వేదవ్యాస్‌ వంటి సీనియర్లు ఆయా పార్టీల్లోనే కొనసాగిఉంటే వారికి కనీస గుర్తింపయినా వచ్చి ఉండేదంటున్నారు. ఈ దృష్ట్యా కులముద్ర వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువంటున్నారు.
చిరంజీవికి 17 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్న కారణంతోనే కాంగ్రెస్‌ ఆయన పార్టీని విలీనం చేసుకుని రెండు పదవులు ఇచ్చింది తప్ప, చిరుపై ప్రేమతో కాదన్నది నిర్వివాదం. అయితే, చిరంజీవి విస్తరణ సమయంలో కేవలం ఇద్దరినే సిఫారసు చేయడం ద్వారా మిగిలిన వారిని దూరం చేసుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాసనసభలో ఉన్న ఆ కొద్దిపాటి న్యాయపరమైన చిక్కు కూడా తొలగిపోతే, ఇక అంతా అధికారికంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలవుతారు. అప్పుడు చిరంజీవి వెంట ఉన్న ఇప్పటి 14 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట శాశ్వతంగా ఉంటారన్న నమ్మకం లేదు. కాంగ్రెస్‌లో ఢిల్లీ లాబీ ఉన్నవారికే పదవులు వస్తాయి కాబట్టి, అంతా ఢిల్లీలోనో, ఇక్కడ సీఎం స్థాయిలోనో కొత్త గాడ్‌ఫాదర్లను ఎంచుకుంటారు. ఇప్పటికే కొందరు నేరుగా సీఎంతో సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే.

అప్పుడు చిరంజీవికి సొంతంగా ఎలాంటి బలమూ ఉండదు. మళ్లీ కాంగ్రెస్‌లోనే కొత్త శక్తులను సమీకరించుకోవలసి వస్తుంది. చిరు మనస్తత్వం ప్రకారం అది చాలా కష్టమని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. సొంత బలం, బలగం లేకపోతే కాంగ్రెస్‌లో గుర్తింపు కష్టం. ఈ క్రమంలో చిరంజీవి సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం భవిష్యత్తులో ఎప్పటికయినా మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. విస్తరణలో చిరు సిఫారసు వల్ల సొంత పార్టీ నేతలు ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా అధికారికంగా కాంగ్రెస్‌లో విలీన వార్త కోసం ఎదురుచూస్తున్నారు. అది పూర్తయితే ఇక చిరంజీవిని విడిచి కాంగ్రెస్‌లో కొత్త దేవుళ్ల కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. ప్రజాకర్షణ, నిబద్ధత ఉన్న ఎన్టీఆర్‌ లాంటి ఇమేజ్‌ ఉన్న వారే రాజకీయాల్లో తప్పటడుగులు వేస్తే తిరుగుబాటు తప్పలేదని, రెండేళ్లు కూడా పార్టీని నడిపించలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్న చిరంజీవి అన్న గారి కంటే ఎక్కువకాదని చిరు ఎదుగుదలను కోరుకునే ఆయన సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు.

No comments: