Thursday, January 19, 2012

కాపు వర్గానికి కొమ్ముకాసి వారికే మంత్రి పదవులు

ఎంతోకాలంగా ఉత్సుకత రేపుతున్న కిరణ్‌ కుమార్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణ కొత్త పుంతలు తొక్కింది!. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చక్రం తిప్పి కాపు వర్గానికి కొమ్ముకాసి వారికే మంత్రి పదవులు ఇప్పించారని సమాచారం. దీంతో బడుగులు మండిపడుతున్నారు. బీసీ కార్డుతో అంచెలంచెలుగా ఎదిగిన బొత్సకు తాము బోడి మల్లయ్యలుగా కనిపిస్తున్నామా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి శంకర్రావును అవసరానికి ఉపయోగించుకుని కరివేపాకులా తీసివేశారని దళితులు సైతం నిప్పులు చెరుగుతున్నారు.

రాష్ర్ట మంత్రివర్గంలో కాపు సామాజిక వర్గానికి మంత్రి పదవులు పెంచి, ఇతర సామాజిక వర్గాలను ఖాతరు చేయకపోవడాన్ని అన్ని సామాజిక వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రధానంగా బొత్స తీరును ఖండిస్తున్నాయి. ముఖ్య మంత్రి సీటుపై కన్నేసిన బొత్స వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ బడుగులను బలిపశువులను చేస్తున్నారని తూర్పా రబడుతున్నారు. రా్రష్ట మంత్రివర్గంలో బీసీ ఎమ్మెల్యేలకు సముచిత స్థానం కల్పిస్తారని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తరుణంలో అధిష్ఠానం మొండిచేయి చూపిందని ఆరోపిస్తున్నారు.

కేవలం ఇద్దరని మాత్రమే కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గం లోకి తీసుకోవడం... ఆ ఇద్దరు కూడా బలిజ, కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో తమకు అన్యాయం జరి గిందని బడుగులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్‌ మంత్రివర్గంలో సామాజిక న్యాయం కొరవడిందని బడుగులు రుజువులతోసహా గణాంకాలు చూపుతున్నారు. 52 శాతం ఉన్న బడుగులకు కేవలం పది స్థానాలకే పరిమితం చేసి 12 శాతం అని చెప్పుకుంటున్న కాపు వర్గానికి 8 స్థానాలు ఏ విధంగా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో కన్నా లక్ష్మీనారాయణ, తోట నర్సింహ, వట్టి వసంతకుమార్‌ కాపు వర్గానికి చెందినవారు ఉన్నారనీ, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్‌ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారని గుర్తు చేస్తున్నారు.

tabsకాగా ప్రస్తుతం కొత్తగా మంత్రిపదవులు పొందిన సి రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు కూడా కాపు సామాజిక వర్గానికి చెందివ వారు కావడం గమనార్హం. అయితే మున్నూరు కాపులు మాత్రం బీసీ రిజర్వేషన్లు పొందుతున్నారు.కనుకనే బడుగులు మండిపడుతున్నారు. 37 మంది ఉన్న మంత్రివర్గంలో కులాలపరంగా చూస్తే బడుగులకు ఏ విధంగా అన్యాయం జరిగిందో వివరిస్తున్నారు. రాష్ర్ట జనాభాలో ఐదు శాతం ఉన్న రెడ్లకు 11, 12 శాతం ఉన్న కాపు సామాజిక వర్గానికి 8, 17 శాతం ఉన్న దళితులకు ఐదు స్థానాలు కాగా... 52 శాతం ఉన్న బీసీలకు కేవలం 10 స్థానాలేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తెరవెనుక సూత్రధారి బొత్స సత్యనారాయణ బీసీలకు అండగా నిలుస్తానని గతంలో ప్రకటించిన విధంగా తమ పక్షాన పోరాడాలనీ, తమకు భవిష్యత్‌లో అయినా సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేయాలని బడుగులు కోరుతున్నారు. అయితే బొత్స ఇప్పటి మాదిరీ తమను బోడిమల్లయ్యలుగానే చూస్తే భవిష్యత్‌లో తగిని గుణపాఠం చెపుతామని బడుగులు హెచ్చరిస్తున్నారు.

No comments: