Thursday, January 19, 2012

చిరుపై ‘దాసరి’ అస్త్రం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. అధిష్ఠానం వద్ద తన పలుకుబడి తగ్గకుండా చూసుకుంటూనే, ఎందుకైనా మంచిదన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతానికి తెర తీశారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతు న్నాయి. తన ప్రభుత్వాన్ని అస్థిర పరచటానికి, పీఠం కిందకు నీళ్ళు తేవటానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కొత్తగా పార్టీలో చేరిన చిరంజీవి పావులు కదుపు తున్నారన్న అనుమానంతో ఉన్న కిరణ్‌, అందుకు ప్రతిక్రియ ప్రారంభించినట్టు పార్టీలో చెప్పుకుంటున్నారు. ఈ ప్రతివ్యూహంలో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణరావును ముఖ్యమంత్రి రంగంలోకి దించినట్టు ప్రచారం జరుగుతోంది.

దాసరి లేఖాస్త్రం... సంక్రాంతి తర్వాత తన వర్గానికి మంత్రి పదవులు వస్తాయని ఆశిస్తున్న చిరంజీవి, తనకు అత్యంత సన్నిహితుడైన సీ రామచంద్రయ్యకు పదవి దక్కటాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేయటానికి దాసరి నారాయణ రావు రంగ ప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. తాజాగా దాసరి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి శుక్రవారం ఒక లేఖ రాశారని, అందులో ఒకరిని అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరత్వంపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారని బయటకు పొక్కింది. అందులో చిరంజీవి పేరు ఉన్నదీ లేనిదీ తెలియకపోయినప్పటికీ ఆయనపై ఫిర్యాదు చేసేందుకే దాసరి లేఖాస్త్రాన్ని ప్రయోగించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పనిలో పనిగా చిరంజీవికి మద్దతుదారుగా నిలిచిన బొత్సపై సైతం దాసరి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి వ్యూహంలో భాగమే?
chirusగత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి, ఇటీవలే సతీ వియోగంతో నిర్వేదంగా ఉన్న దాసరి ఒక్కసారిగా ఈ లేఖ రాయటం పార్టీ వర్గాలలో సంచలనం కలిగించింది. ఆయన మరోసారి రాజ్యసభ టికెట్‌ ఆశిస్తున్నందువల్లనే ఈ లేఖ రాశారని కొందరు అంటుంటే, మరి కొందరు ఇది ముఖ్యమంత్రి వ్యూహంలో భాగం అని వ్యాఖ్యానిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి తానే బలమైన నేత అనిపించుకునేందుకు చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలు, నిన్న గాక మొన్న పార్టీలో చేరిన వెంటనే తన మాట నెగ్గాలంటున్న ఆయన మంకుపట్టు, అన్నిటికీ మించి కంటిలో నలుసు మాదిరిగా ఉన్న బొత్సతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటూ తనపై సవారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆగ్రహం కిరణ్‌లో ఉంది. ఆయనను అడ్డుకునేందుకు దీటైన వారు ఎవరా అని ఆలోచించిన కిరణ్‌, అదే కాపు సామాజిక వర్గానికి చెంది, సినీ రంగంలో లబ్ధ ప్రతిష్ఠుడైన దాసరి నారాయణరావును అస్త్రంగా ప్రయోగిస్తే అధిష్ఠానం సైతం ఆయన మాటకు విలువ ఇస్తుందనుకున్నారని, అదే అదనుగా దాసరితో సంప్రదించి లేఖ రాయించారన్న ప్రచారం పార్టీ వర్గాలలో జోరుగా సాగుతున్నది.

నేనెరుగ...నేనెరుగ...
ఒకవైపు చిరంజీవి, మరోవైపు బొత్సను టార్గెట్‌గా చేసుకుని ముఖ్యమంత్రి ఈ పదునైన దాసరి అస్త్రాన్ని ప్రయోగించారన్న ప్రచారం సాగుతుంటే, బొత్స సత్యనారాయణ మాత్రం తనకేమీ తెలియదన్నట్టు అమాయకత్వం ప్రదర్శించారు. రాజ్యసభ సభ్యుడుగా అధినేత్రికి లేఖ రాయటానికి దాసరి సర్వ హక్కులూ కలిగి ఉన్నారని, ఒకరిని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాశారంటే అది ఆయన అభిప్రాయం కావచ్చుననీ బొత్స మీడియాతో చెప్పారు.

No comments: